ఏపీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి
ఏపీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టైలరింగ్‌లో 90 రోజుల శిక్షణ అందించి, ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామని ప్రకటించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సామాజిక వర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఇందు కోసం ఎంపిక చేయనున్నారు. బీసీ వెల్ఫేర్ నుంచి 46,044, ఈడబ్ల్యూఎస్ నుంచి 45,772, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
40శాతం మేర సెంటర్లను గుర్తించి ఒక్కో కేంద్రంలో 30 నుంచి 50 మందికి టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 8వ తేదీన శిక్షణ కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తైంది. ఎస్సీ మహిళలకు కూడా త్వరలో ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరిస్తే లబ్ధిదారులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కీమ్‌ను దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.