అమరావతి: రాష్ట్రంలో ఒక రోజు ముందు అంటే నేటి నుంచి ఫించన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈ రోజు నుంచే నగదు అందజేయనున్నారు. కుప్పంలో గుడపల్లె మండలం బెగ్గిలిపల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కొత్తగా మంజూరైన 7,944 వితంతు పింఛన్లతో కలిపి మొత్తం 62.94 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తారు. ఇవాళ నగదు అందుకోలేకపోయిన వారు ఫిబ్రవరి 2న తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఆ మైనర్లకు పెన్షన్లు..
రాజధాని అమరావతి ప్రాంతంలో భూమిలేని పేదలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేలు పెన్షన్ అందిస్తోంది. ఏదైనా కారణంతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన పిల్లల్లో మైనర్లు ఉంటే వారికి ఆర్థిక సాయం చేయాలని ఇటీవల క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ఇలా మైనర్లకు పెన్షన్లు అందజేయడానికి నిబంధనలు అడ్డొస్తున్నాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయా పిల్లలకు పెన్షన్లు అందించే అధికారాన్ని సీఆర్‌డీఏకు అప్పగించింది ప్రభుత్వం.