మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తే రేషన్ కార్డు జారీ: ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2024 1:59 AM GMT
andhra pradesh, government, ration cards,  newly married couple,

మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తే రేషన్ కార్డు జారీ: ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన జంటలు ఈజీగా రేషన్‌ కార్డులను పొందొచ్చు. వివాహ నమోదు ధృవీకరణ పత్రం చూపిస్తే కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. అయితే.. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా.. జగన్ బొమ్మను ముద్రించిందని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ రంగులతో ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన డిజైన్లను ఏపీ ప్రభుత్వ అధికారులు పరిశీలన చేస్తున్నారు.

దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని 2020లో వైసీపీ ప్రభుత్వం తెలిపింది. కొన్నాళ్లకు.. రెండున్నర గంటల్లోనే సచివాలయాల ద్వారా ఇప్పిస్తామని పేర్కొంది. అయితే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రస్తుత ప్రబుత్వం చెప్పింది. అంతేకాదు.. గత ఐదేళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టిందని పేర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్‌ కార్డులు ఉన్నాయి. 2024 ఆగస్టుకి వాటి సంఖ్య 1,48,43,671కి చేరింది. గత ఐదేళ్లలో పెరిగిన కార్డులు 1.10 లక్షలు మాత్రమే. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే.. అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్‌ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్లైన వారికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసకుంటోంది. వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్‌ కార్డు జారీ చేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 89 లక్షల రేషన్‌ కార్డులకు ఆహారభద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్‌ చేస్తుంటే నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది.

Next Story