Andhra Pradesh: పెన్షన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్
ఏపీలో పెన్షన్‌లు తీసుకునే వారికి ముఖ్య గమనిక.
By Srikanth Gundamalla Published on 29 May 2024 12:57 AM GMTAndhra Pradesh: పెన్షన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్
ఏపీలో పెన్షన్‌లు తీసుకునే వారికి ముఖ్య గమనిక. జూన్ నెలకు సంబంధించిన పెన్షన్‌ను కూడా ఈసారి ఎలా ఇస్తారో అని లబ్ధిదారుల్లో సందేహాలు ఉన్నాయి. పోలింగ్ ముగిసినందున ఇంటికే తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తారా అని అనుకున్నారు. కానీ.. దీనిపై తాజాగా స్పష్టత వచ్చింది. జూన్ 1న పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలోనే జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దివ్యాంగులు, నడవలేనివారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేయనున్నారు. గత నెలలో కూడా బ్యాంకు అకౌంట్లలోనే పెన్షన్ డబ్బులను జమ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అవుతుందేమో అని ఆందోళనలో ఉన్నారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన వెంటనే వాలంటీర్ల సేవలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వారితో పెన్షన్లను పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. దాంతో.. ఏప్రిల్ 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లను అందజేశారు. మే నెలలో అయితే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఇక జూన్ నెలకు సంబంధించి కూడా బ్యాంకు ఖాతాల్లోలనే వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
మే నెలలో పెన్షన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన క్రమంలో పలువురికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా మంది బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. దాంతో బ్యాంకుల వద్ద రద్దీ కనిపించింది. మరికొందరికి బ్యాంకు అకౌంట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డారు. మరి జూన్ నెల పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి. గత నెలలో అన్ని లోటుపాట్లు సరిచేసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లలో డబ్బు జమ అవుతాయి. లబ్ధిదారులు కూడా వాటిని తేలికగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మరో ఏపీ ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్ జూన్ 4వ తేదీన వెల్లడించనుంది.