పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు సర్కార్ నయా రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 1వ తేదీన కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  2 July 2024 6:55 AM IST
Andhra Pradesh, government, new record,  pension distribution,

పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు సర్కార్ నయా రికార్డు 

ఆంధ్రప్రదేశ్‌లో జూలై 1వ తేదీన కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసింది. స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డును నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పెన్షన్ల పంపిణీలో రికార్డు నమోదు అయ్యింది. ఒకే రోజులో 95 శాతం మేర పెన్షన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిలబడింది. సోమవారం రాత్రి 10 గంటల వరకు 61.95 లక్షల మందికి అంటే 95.5 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. కొత్త రికార్డు సృష్టించిన అధికారులు, యంత్రాంగానికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇక సోమవారం పెన్షన్లను అందుకోలేని వారికి మంగళవారం ఇంటి వద్దకే పెన్షన్లను వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు.

కాగా.. గత ప్రభుత్వం హయాంలో 2.65లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఎన్నడూ ఇంత వేగంగా పింఛన్ పంపిణీ జరగలేదు. గతంలో ఒక్క రోజులో పంపిణీ చేసింది కేవలం 88శాతం మాత్రమే అని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో అత్యధికంగా 97శాతం ఫించన్ల పంపిణీ పూర్తి చేశారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 91శాతం పింఛన్ పంపిణీ పూర్తయ్యింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో 1.30 లక్షల మంది సచివాయల ఉద్యోగులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వాలంటీర్లు లేకుండా సాధ్యపడది వైసీపీ చెప్పిందనీ మంత్రి పార్థసారథి అన్నారు. కానీ 1.30 లక్షల మంది సచివాలయ సిబ్బందితో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి, ఉద్యోగుల కష్టమే కారణమని మంత్రి పార్థసారథి అన్నారు.

మొత్తం 28 కేటగిరీల్లో ఒక్కరోజులోనే పింఛన్లను పంపిణీ చేశామన్నారు మంత్రి సారథి. గత ప్రభుత్వం ఐదేళ్లకు రూ.వెయ్యి పెంచితే.. చంద్రబాబు 17రోజుల‌ పాలనలోనే వెయ్యి పెంచి రూ.4వేలు చేశారని చెప్పారు. గతంలో పింఛన్‌ను రూ.200నుంచి‌ రూ.2000లకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పని చేశారని మంత్రి పార్థసారథి అన్నారు. మున్ముందు కూడా ఇదే వేగంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందబోతుందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.

Next Story