'మత్స్యకార భరోసా' నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ పథకం నిధులను అకౌంట్లలో జమ చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని సీఎం స్వయంగా అందజేయనున్నారు. ఏపీ మత్స్యకార భరోసా కింద అర్హులైన మత్స్యకారులకు రూ.20 వేలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
మత్స్య సంపద సంఖ్యను పెంచడానికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 వరకు దేశ వ్యాప్తంగా సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్నారు. ఈ సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. ఈ సమయంలో మత్స్యకారులకు ఉపాధి పరంగా ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను అమలు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద రూ.10 వేలు సాయం అందించగా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సాయాన్ని రూ.20 వేలకు పెంచింది.
ఈ పథకం కింద 1,22,968 మంది జాలర్లకు లబ్ధి చేకూరనుంది. గత ఆర్థిక సంవత్సరంలో కనీసం మోటారు పడవలకు 100 లీటర్లు, మెకనైజ్డ్ పడవలకు 1000 లీటర్ల మేర డిలీజ్ రాయితీని ఉపయోగించుకుని ఉండాలనే గత ప్రభుత్వ నిబంధనను ప్రస్తుత ప్రభుత్వం తొలగించింది. ఎంఎస్ చట్టం ప్రకారం మత్స్యశాఖలో నమోదైన అన్ని పడవలకు మత్స్యకార భరోసాను అందించనుంది.