అమరావతి: డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర పథకం పీఎంఎఫ్‌ఎంఈని రాష్ట్రంలో మహిళ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఆసక్తి ఉన్న మహిళలకు కేవలం 6 శాతం వడ్డీకి రూ.40 వేల చొప్పున రుణం మంజూరు చేయనుంది. దీన్ని రెండేళ్లలో చెల్లించాలి. ఈ ఏడాది 10 వేల మందికి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలో ఉన్న 6,400 మంది మహిళలను ఇప్పటికే ఎంపిక చేశారు. మిగత 3,600 మంది అర్హుల ఎంపిక కూడా చేపట్టారు.
కేంద్రం రూ.40 కోట్లు విడుదలకు అనుమతి ఇవ్వగా, వారం రోజుల్లోనే మహిళల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. 2024- 25 ఏడాదికిగాను ఈ ఈవెంట్ కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.40 కోట్లు అందించనుంది. పీఎమ్‌ఎఫ్‌ఎమ్‌ఈ కింద ఎంపిక చేసిన మహిళలకు వారి బిజినెస్‌ను మరింత పెంచుకునేందుకు స్త్రీ నిధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 శాతం వడ్డీకే రూ.40 వేల లోన్‌ను అందిస్తుంది. తీసుకున్న రుణాన్ని రెండేళ్ల వ్యవధిలో చెల్లించాలి. ఇలా చెల్లించిన వారికి మరింత ఎక్కువగా రుణాన్ని తక్కువ వడ్డీకే ఇస్తారు.