అమరావతి: తమ ఖాతాల్లో వరద సాయం డబ్బులు పడలేదంటూ పలువురు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ నెల 4 వ తేదీలోగా అందరికీ పరిహారం పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నష్టపోయినవారిలో అసంతృప్తి ఉండకూడదన్నారు.
భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదులపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అందించాల్సిన రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో రైతులకు చెల్లింపులు రూ.301 కోట్లు కాగా మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందించారు.
బ్యాంక్ ఎకౌంట్ తో ఆధార్ లింక్ కాకపోవడం, ఆధార్ అకౌంట్ మ్యాచ్ కాకపోవడం, ఎకౌంట్ యాక్టివ్ గా లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, ఎకౌంట్ తప్పుగా నమోదు అవ్వడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము పలువురు లబ్ధిదారుల అకౌంట్లలో జమకాలేదని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంక్ కు వెళ్లి కెవైసీ పూర్తి చేసుకోవాలని కోరినట్లు అధికారులు తెలిపారు.