ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది.

By Srikanth Gundamalla
Published on : 27 July 2024 6:43 AM IST

Andhra Pradesh, government, good news,  woman ,

ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతీ మహిళ ఖాతాలో నెలకు రూ.1500 జమ చేయనుంది. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసన మండలిలో ప్రకటన చేశారు.

శాసనమండలిలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున.. ఏడాదికి రూ. 18 వేలు అందిస్తామని చెప్పారు. ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళలు అంటే ముందు నుంచి ఎంత గౌరవమో అందరికీ తెలుసని పేర్కొన్నారు. అందుకే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు.

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడంపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీని కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతీ మహిళకు 18 సంవత్సరాలు నిండాలని పేర్కొంటున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్.. దీంతోపాటు ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలని చెబుతున్నారు. వచ్చే నెలలో ఈ ఆడ బిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. ట్వీట్ వైరల్‌ అవుతోన్న నేపథ్యంలోనే మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో ప్రకటన చేయడం మహిళలకు ఊరటనిస్తోంది.


Next Story