కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త
తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దాంతో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక జగన్ ప్రభుత్వం వరుసగా సంక్షేమ పథకాల నిధులను కూడా విడుదల చేస్తోంది. ఇటీవలే వైఎస్సార్ చేయూత పథకం నిధులను కూడా జమ చేసింది. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
సీఎం జగన్ మరోసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వైద్యారోగ్యశాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 2014 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ అర్హులైన 2146 ందిని క్రమబద్దీకరిస్తూ వైద్యశాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2025 మంది సిబ్బంది, డీఎంఈ పరిధిలో 62, కుటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాల్లో నలుగురిని క్రమబద్దీకరణ చేశారు. ఎన్నికల సమయంలో క్రమబద్దీకరణపై జగన్ మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ హామీని అమలు చేయడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.