కాంట్రాక్ట్ ఉద్యోగులకు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on  16 Aug 2023 11:35 AM GMT
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనలను సడలిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌పై నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. హామీలో భాగంగా 2014, జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయాలని గత కేబినెట్లో తీర్మానం చేశారు. దీంతో ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులకు ఈ ప్రయోజనం దక్కలేదు. దీనిపై అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేసింది.

ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన సీఎం జగన్ అంటూ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు చెబుతున్నారు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు.

Next Story