Andhra Pradesh: పెన్షన్ అకౌంట్లో జమ కాలేదా..? ఇది తెలుసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 May 2024 2:02 AM GMTAndhra Pradesh: పెన్షన్ అకౌంట్లో జమ కాలేదా..? ఇది తెలుసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఈసారి పెన్షన్ డబ్బులను అకౌంట్లలో జమ చేస్తామని చెప్పిన విసం తెలిసిందే. దాంతో.. రాష్ట్రవ్యాప్తంగా 98.67 శాతం మంది లబ్ధిదారులకు అకౌంట్లలో డబ్బులు జమ చేశామని అధికారులు వెల్లడించారు. 48,92,503 మందిలో 48,17,718 మంది డబ్బులు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఇక కొంత మందికి మాత్రం వివిధ కారణాలతో డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. అలాంటి వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు.
బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ కాని వారి వివరాలను సేకరించినట్లు అధికారులు చెప్పారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 74,399 మంది పెన్షన్ దారులకు బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ కాలేదన్నారు. సచివాలయ ఉద్యోగులు వీరందరికీ ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ అందజేస్తారని చెప్పారు. శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ జాబితాను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రధానంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా 15,13,752 మంది ఉన్నట్లు చెప్పారు.
కాగా.. బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టారు. మండుటెండలో తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు ఎగబడ్డారు. దాంతో.. ఆయా బ్యాంకుల వద్ద రద్దీ కనిపించింది. మరోవైపు కొందరికి 2 నుంచి 3 బ్యాంకు అకౌంట్లు ఉండటం వల్ల ఎందులో డబ్బు జమ అయ్యిందో తెలుసుకునేందుకు కంగారుపడ్డారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులు గంటల కొద్ది క్యూలైన్లలో నిలబడి అకౌంట్‌ను చెక్ చేయించుకున్నారు. కానీ.. కొందరి అకౌంట్లలో జమ కాలేదనీ నిరాశ చెంది వెనక్కి వెళ్లిపోయారు. ఇక మరికొందరు చాలా కాలంగా అకౌంట్‌లో ఎలాంటి ట్రాన్సాక్షన్లు జరపకపోవడంతో అకౌంట్ ఆగిపోయిందనీ.. ముందుగా కొంత డబ్బును జమ చేసి.. ఆ తర్వాత రెండ్రోజులకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో నిరాశ చెందారు పెన్షన్ దారులు. ఇలా మొత్తంగా కొందరు పెన్షన్ డబ్బులను అందుకుంటే.. ఇంకొందరు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో గంటల కొద్ది నిలబడి కూడా నిరాశతోనే వెనక్కి వెళ్లిపోయారు. ఈ నెల కూడా పెన్షన్ తమకు తలనొప్పిగానే మారిందని లబ్ధిదారులు అంటున్నారు.