టీడీపీ-జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి కీలక కామెంట్స్

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  4 March 2024 4:30 AM GMT
andhra pradesh, election, bjp, purandeswari,

టీడీపీ-జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి కీలక కామెంట్స్

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఎన్నికల శంఖారావం పూరించాయి. అంతేకాదు.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీ కూడా వ్యూహాలను రచిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచిస్తోంది. రెండోసారి గెలిచేందుకు వ్యూహాలను రచిస్తోంది. అయితే.. ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తోన్నాయి. ఈ పొత్తులో బీజేపీ కూడా కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయంపై ఇప్పటి వరకు అయితే పూర్తి క్లారిటీ రాలేదు.

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీతో సమన్వయంతో ఉంది. ఇక ఆ పార్టీ ఏపీలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తుంది. ఇక బీజేపీ కూడా ఈ పొత్తులో చేరుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఇదే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పొత్తులపై పురందేశ్వరి స్పందించారు. ఒక వేళ పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలే ప్రకటిస్తారని వెల్లడించారు. తాము 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను అభ్యర్థుల జాబితాను అయితే సిద్ధం చేశామని చెప్పారు. ఇక ఆ జాబితాను మరో రెండ్రోజుల్లో హైకమాండ్‌కు పంపిస్తామని పురందేశ్వరి చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 వేల మంది వరకు అభ్యర్థులు వచ్చారనీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. ఇక జాబితాను పూర్తిగా పరిశీలించామని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్‌ చేశామని ఆమె తెలిపారు. ఇక తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపి తుది అభ్యర్థులను ఖరారు చేస్తుందని పురందేశ్వరి అన్నారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామనీ.. త్వరలోనే మేనిఫెష్టో కూడా ప్రకటిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు.

Next Story