ఈ నెల 27 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు..ప్రచార షెడ్యూల్ ఇదే
టీడీపీ అధినేత చంద్రబాబు 'ప్రజాగళం' పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.
By Srikanth Gundamalla Published on 24 March 2024 3:27 PM ISTఈ నెల 27 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు..ప్రచార షెడ్యూల్ ఇదే
లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎలాగైనా తమ కూటమి అధికారంలోకి వస్తుందని దీమాగా ఉన్నారు చంద్రబాబు. ఆయన ఇప్పటికే దాదాపుగా ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచారంలో టికెట్ దక్కించుకున్న అభ్యర్తులు దూసుకెళ్తున్నారు. ఈ నెల 27 నుంచి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది.
టీడీపీ అధినేత చంద్రబాబు 'ప్రజాగళం' పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌షోలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. తొలి విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు చంద్రబాబు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది.
మార్చి 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత 28వ తేదీన రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 29వ తేదీన కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 30న ప్రొద్దుటూరు, మైదకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారంలో పాల్గొంటారు. తొలి షెడ్యూల్ చివరి రోజు 31వ తేదీన కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక 25, 26 తేదీల్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.