మరికాసేపట్లోనే ఓట్ల లెక్కింపు.. పిఠాపురంపైనే అందరి చూపు
ముఖ్యమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు ఎవరిదనే దానిపై అందరి చూపు ఉంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 7:31 AM ISTమరికాసేపట్లోనే ఓట్ల లెక్కింపు.. పిఠాపురంపైనే అందరి చూపు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా గత నెల 13న జరిగాయి. అయితే.. ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పలువురు ముఖ్యమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు ఎవరిదనే దానిపై అందరి చూపు ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆయన గెలుపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతోంది. తెలుగు ప్రజలంతా ఆయన గెలుస్తారా? లేదా? అనే చర్చలో ఉన్నారు. పిఠాపురంలో ఎన్నడూ లేని విధంగా 86.63 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అర్ధరాత్రి వరకు మహిళలు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మరోవైపు ఇటీవల వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా కనిపిస్తున్నాయి. అత్యధిక సర్వే సంస్థలు పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తాయని చెప్పాయి. ఇక మరికొనని సర్వేల్లో వైసీపీ నుంచి పిఠాపురం అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత గెలుస్తారని వెల్లడించాయి. కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఆయనకు టీడీపీ, బీజేపీ పార్టీల మద్దతుదారులు కూడా ఉన్నారు. దాంతో.. పవన్ కల్యాణ్ విజయం పక్కా అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు చెబుతున్నారు.
మరోవైపు పవన్ కల్యాన్ గెలుపై పిఠాపురంలోనే కాదు ఆయా ప్రాంతాల్లో బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ గెలిస్తే ఒక చరిత్ర సృష్టిస్తారని పలువురు అంటున్నారు. గత ఎన్నికల్లో రెండుస్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఓటమిని చూశారు. మరి ఈసారి అయినా ఎమ్మెల్యేగా గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెడతారా చూడాలి. ఇలా కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురంలో గెలుపుపై దేశంలోనే ప్రత్యేక చర్చ జరుగుతోంది.