వాలంటీర్లు అంటే చంద్రబాబుకి భయం: పేర్ని నాని
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 1 April 2024 3:19 PM GMTవాలంటీర్లు అంటే చంద్రబాబుకి భయం: పేర్ని నాని
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన మాటలతో ప్రజలకు ఎర వేస్తారనీ.. అవసరం తీరాక పాతర వేస్తారంటూ కామెంట్స్ చేశారు. రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్ట కొట్టారంటూ మండిపడ్డారు. వాలంటీర్లు వద్దు అంటూ ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ప్రశ్నించారు పేర్ని నాని.
చంద్రబాబు పేదలను ఓటు బ్యాంకుగానే చూశారని పేర్ని నాని అన్నారు. ఆయన కుట్రలన అన్నింటినీ ప్రజలు గమనించారని పేర్కొన్నారు. చంద్రబాబుకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేది కూడా తెలుసని అన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదంటూ విమర్శించారు. ఏదైనా చేసి కుర్చీలో కూర్చొని డబ్బులు వెనక వేసుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దుయ్యబట్టారు.
ఇక వాలంటీర్లు అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని పేర్ని నాని అన్నారు. వాలంటీర్లు వద్దని ఢిల్లీ నుంచి మండలం వరకు చంద్రబాబు తన మనుషులను తిప్పారని అన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో చంద్రబాబు మాట మార్చారని అన్నారు. పెన్షన్ల పంపిణీ ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడైనా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతానని పవన్ కల్యాణ్ అన్నారని పేర్ని నాని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు మోదీపై విమర్శలు చేశారనీ.. కానీ ఇప్పుడు సిగ్గులేకుండా అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నాని అన్నారు. పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ కల్యాణ్ అంటారు కానీ.. చిన్న జలుబు చేసినా మళ్లీ హైదరాబాద్‌కు పారిపోతారని పేర్ని నాని విమర్శలు చేశారు.