ఈ ఎన్నికలపై ఆంధ్రా ఆక్టోపస్ ఏమన్నారంటే?
ఎన్నికల పోలింగ్ పూర్తయిందంటే చాలు ఎగ్జిట్ పోల్స్ సందడి ఉంటుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 May 2024 9:17 AM GMTఈ ఎన్నికలపై ఆంధ్రా ఆక్టోపస్ ఏమన్నారంటే?
ఎన్నికల పోలింగ్ పూర్తయిందంటే చాలు ఎగ్జిట్ పోల్స్ సందడి ఉంటుంది. సాధారణంగా పోలింగ్ ముగిశాక సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సర్వే సంస్థలు వెల్లడిస్తాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం, ఏడు దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ కావడంతో ఎగ్జిట్ పోల్స్ ను వెలువరించడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం. సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దీంతో చివరి దశ పోలింగ్ ముగిశాక.. అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తారు.
కానీ కొందరు ప్రముఖులు మాత్రం తమ తమ సర్వేలను వెల్లడిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు ఉన్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒకరు. ఆయన ఈసారి మాత్రం సర్వే గురించి కానీ ఎవరు గెలుస్తారని కానీ చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం, 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని ఆయన ఇంతకు ముందు జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లే జరగడంతో ఆంధ్రా ఆక్టోపస్ అనే పేరును తెచ్చిపెట్టింది. అయితే 2018 నుంచి ఆయన అంచనాలకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులతో కూడిన పీపుల్స్ ఫ్రంట్ గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. అది జరగలేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, 175 అసెంబ్లీ స్థానాలకు గాను 100 స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం పార్టీ రెండవసారి ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఆయన జోస్యం చెప్పారు. అదీ జరగలేదు. వైఎస్సార్‌సీపీ 151 స్థానాల్లో విజయం సాధించి టీడీపీని కేవలం 23 స్థానాలకే పరిమితం చేసింది. ఆ తర్వాత లగడపాటి తాను ఎలాంటి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు చేయనని ప్రకటించారు.
సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత, లగడపాటి ఎన్నికల ఫలితాలపై నోరు మెదపలేదు. విజయవాడ (తూర్పు)లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా లేనని, మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని చెప్పారు. నేను 2019లోనే సర్వేలు చేయడం మానేశాను కాబట్టి ప్రస్తుత ఎన్నికల్లో ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అన్నారు. హైదరాబాద్ నుండి లక్షలాది మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కి వచ్చారని.. ప్రజల తీర్పు జూన్ 4న మాత్రమే తెలుస్తుందని అన్నారు. అలా ఆంధ్రా ఆక్టోపస్ ఈసారి ఎన్నికల ఫలితాల గురించి పెద్దగా ఆసక్తి చూపించలేదు.