మోసాల బాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలి: సీఎం జగన్

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది.

By Srikanth Gundamalla  Published on  28 March 2024 1:30 PM GMT
andhra pradesh, election, cm jagan,  tdp, chandrababu  ,

మోసాల బాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలి: సీఎం జగన్ 

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయాల్లో వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఐదేళ్లలో తాము తీసుకొచ్చిన పథకాలను గురించి ప్రజలకు వివరిస్తోంది. అలాగే గతంలో టీడీపీ చేయలేకపోయిన పనులనూ వివరిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈసారి ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి వెనుకబడిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా ప్రతి మాటకు మాట.. సవాల్‌కు ప్రతి సవాళ్లతో రాజకీయాల్లో హీట్‌ కొనసాగుతోంది.

రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీ అయిపోయాయి. సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే నంద్యాలలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చేశారంటూ.. అవన్నీ చూశామని పేర్కొన్నారు. చంద్రబాబు కూటమిని ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు జిత్తులమారి అనీ.. పొత్తులమారీ అంటూ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు పాలనలో ఏపీకి ఒరిగిందేమీ లేదన్నారు సీఎం జగన్. మరోసారి చంద్రబాబుకి ఓటేసి గెలిపిస్తే పదేళ్లు వెనక్కి వెళ్లిపోతామని అన్నారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో ప్రజలే ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలపై కుటుంబ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని అన్నారు. మోసాల చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు కావాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించామన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖునే పెన్షన్ ఇస్తున్నామనీ.. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందించామని చెప్పారు. మహిళలకు పెద్ద పీట వేశామన్నారు. ప్రభుత్వ బడులను మార్చేశామని చెప్పారు. విద్యార్థులకు సాయం అందించామని.. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడ్పాటుని అందించిందని సీఎం జగన్ చెప్పారు. మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తే.. ఇదే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు.

Next Story