అమరావతి: రాష్ట్ర ఇంటర్ బోర్డు దివ్యాంగ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్‌కు ఇకపై సగటు మార్కులు ఇస్తారు. ఈ మేరకు జీవో విడుదల అయ్యింది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో ఒకటి రాస్తే చాలన్న రూలు ఉంది. 5 పేపర్లలో 4కి మార్కులు వేసి మినహాయింపు పేపర్‌కు 'E'అని సర్టిఫికెట్‌లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై ఐఐటీ, ఎన్‌ఐటీలు అడ్మిషన్లు నిరాకరిస్తుండటంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది మంత్రి లోకేష్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇప్పుడు అన్నింటీకి మార్కులు ఇస్తారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన ఇంటర్ విద్యార్థులకు ఒక లాంగ్వేజ్ సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మినహాయింపు ప్రస్తుతం ఆప్షనల్‌గా ఉంది. మినహాయింపు పొందిన విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాసంస్థల్లో చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మినహాయింపుతో పాటు నాలుగు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల సగటును మినహాయింపు పొందిన సబ్జెక్టుకు కేటాయించనున్నట్టు జీవోలో పేర్కొన్నారు.
కుష్టు, కండరాల బలహీనత, యాసిడ్ దాడి బాధితులు, మరగుజ్జు, అంధులు, దృష్టి, వినికిడి లోపం ఉన్నవారు, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, క్రానిక్ న్యూరోలాజికల్, రక్త సంబంధిత వ్యాధులు కలిగిన వారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో విద్యాశాఖ తెలిపింది. రెండు భాషా సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిని విద్యార్థులు మినహాయింపుగా పొందవచ్చు. ఈ విధానాన్ని ఇకపై శాశ్వతంగా అమలు చేసేందుకు ఈ ఉత్తర్వులు జారీచేశారు.