సీఎం చంద్రబాబు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు: డిప్యూటీ సీఎం పవన్
సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Sep 2024 12:54 PM GMTఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు ఒక దార్శనికుడు అని చెప్పారు. ఎప్పుడూ ఆయన తనని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని చెప్పారు. మంగళగిరిలోని సి-కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వంలో పనిచేస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు.
ఏపీలో కూటమి ప్రభుత్వ వంద రోజులు పూర్తి చేసుకుందని అన్నారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు డబ్బులు లేవు.. అయినా కూడా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పెన్షన్లను పెంచి పంపిణీ చేశామని చెప్పారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్రను సృష్టించామన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు అందేవే కావని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. నిర్జీవతముతున్న పంచాయతీలను ఆదుకుంటున్నామన్నారు. రూ.1,452 కోట్లను సీఎం చంద్రబాబు పంచాయతీలకు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి తమకు ముఖ్యమన్నారు. వైసీపీ సర్పంచ్‌లు ఉన్న పంచాయతీల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు.
ఇక అన్న క్యాంటీన్లపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోందనీ పేదల కడుపు నింపుతుంటే ఎందుకు అంత కడుపుమంట అన్నారు పవన్ కల్యాణ్. అలాగే గతంలో అన్నా క్యాంటీన్లను ఎందుకు మూసివేయాలని అనిపించందంటూ ప్రశ్నించారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులు కడుపునిండా భోజనం జరుగుతోందని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.