పోటీ పడి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు: వైఎస్ షర్మిల

ఏపీ మాజీ సీఎం తిరుమల పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  27 Sept 2024 3:57 PM IST
పోటీ పడి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు: వైఎస్ షర్మిల

ఏపీ మాజీ సీఎం తిరుమల పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన డిక్లరేషన్ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. దీనిపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ పశ్చాత్తాప దీక్ష , మాజీ సీఎం జగన్ ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారని అన్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సర్కారు తిరుమల లడ్డూను కల్తీ చేసిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైసీపీ హయాంలో మార్కెట్ కంటే తక్కువకే జగన్ సర్కారు నెయ్యి కొనుగోలు చేసిందని చెప్పారు.

హిందూ మతంపై దాడి అని బీజేపీ మాట్లాడుతోందని... చర్చిలు, మసీదుపై దాడి జరిగితే ఇలాగే ఉంటారా అని పవన్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. మత విద్వేషాలు పెంచే ఆలోచన కూటమి నేతలకు ఉందా అంటూ షర్మిల నిలదీశారు. మతాలను రెచ్చగొట్టడమే బీజేపీ ఉద్దేశమని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ది కోసం కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు. కనీసం సీబీఐ విచారణ జరగాలని మోదీకి ఎందుకు అనిపించలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

Next Story