ఈ విజయం తొలి అడుగే.. సుప్రీంకోర్టు తీర్పుపై షర్మిల

సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  18 May 2024 9:15 AM GMT
andhra pradesh, congress, sharmila, supreme court ,

ఈ విజయం తొలి అడుగే.. సుప్రీంకోర్టు తీర్పుపై షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సుప్రీంకోర్టులో ఊరట దక్కిన విషయం తెలిసిందే. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ గతంలో కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం నిషేధించింది. కాగా.. ఈ కడప కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు షర్మిల సవాల్‌ చేయగా దేశ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్ మాట్లాడుతూ.. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్‌ స్వతంత్య్రాన్ని , స్వేచ్ఛను ఎలా హరిస్తారంటూ చెప్పుకొచ్చింది.

సుప్రీంకోర్టు తీర్పుపై తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడు పగిలాలే వివేకానందరెడ్డి రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని వ్యాఖ్యానించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని సుప్రీంకోర్టే తిప్పికొట్టిందన్నారు. ఎప్పటికైనా ఈ ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు వైఎస్ షర్మిల. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో చిల్లర కుట్రలు చేసే వారికి సుప్రీంకోర్టు విధించిన స్టే చెంపపెట్టు అంటూ పరోక్షంగా వైసీపీ పార్టీ అధినాయకులపై మండిపడ్డారు.

సుప్రీంకోర్టు ద్వారా అందిన విజయం తొలి అడుగు మాత్రమే అన్నారు వైఎస్ షర్మిల. రాబోయే రోజుల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులకు శిక్ష పడే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. చిట్ట చివరగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని వైఎస్ షర్మిల అన్నారు.

Next Story