సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష.. వాటిని మనం కాపాడుకోవాలి
Andhra Pradesh CM Jagan Mohan Reddy review meeting on Department of Cooperation.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2022 2:09 PM ISTతాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖపై గురువారం సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం వీ యస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు మన బ్యాంకులు అని వాటిని మనం కాపాడుకోవాలన్నారు. సహకార బ్యాంకులు తక్కువ వడ్డీలకే రుణాలు అందించడం వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎంత వెసులుబాటు ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలన్నారు. బ్యాకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలన్నారు. నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధిచెందుతాయన్నారు. డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలన్న ఆధికారులను ఆదేశించారు.
డీసీసీబీలు పటిష్టంగా ఉంటే.. రైతులు మేలు పొందుతారన్న సీఎం జగన్ అన్నారు. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నాయని, రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోందన్నారు. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమవైపుకు తిప్పుకోవచ్చునని.. తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుందని జగన్ తెలిపారు.
ఇక వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అందుకనే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. అందుకనే రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదు, రాజకీయాలకు చోటు ఉండకూడదన్నారు. అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలన్నారు. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యమన్నారు. పాలనలో సమర్థతతో పాటు, అవినీతి లేకుండా ఉంటేనే, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. లేదంటే ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు.
వ్యవసాయ సలహామండళ్ల సమావేశాల్లో బ్యాకింగ్ రంగంపై రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి దానిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్‌లను సమర్థవంతంగా వాడుకోవాలన్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కూడా కియోస్క్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు సంబంధించి డాక్యుమెంట్లను కియోస్క్‌ల ద్వారా అప్‌లోడ్ చేసే సదుపాయం కూడా ఉండాలన్న సీఎం.. ఈమేరకు కియోస్క్‌ల్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు.