భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, ప్రజలకు కీలక సూచనలు
ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 31 Aug 2024 4:30 AM GMTఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. విశాఖ, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వానలు పడుతున్నాయి. దాంతో.. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ రెండు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వర్షం.. సహాయక చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యల్లో పాల్గొనాలని చెప్పారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
నగరాలు, గ్రామాల్లో మ్యాన్‌హోల్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ, ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలు ప్రమాదబారిన పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడలో కూడా వర్షంపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుడా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ చెప్పారు.