ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్‌.. ఇసుక ఉచితంగా ఇవ్వడంపై సీఎం దిశానిర్దేశం

ఏపీలో సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  3 July 2024 2:45 AM GMT
andhra Pradesh, cm Chandrababu, meeting, free sand policy,

ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్‌.. ఇసుక ఉచితంగా ఇవ్వడంపై సీఎం దిశానిర్దేశం

ఏపీలో సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుసగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, గనులు భూగర్భ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు, రహదారుల పరిస్థితి, ఇసుక విధానం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఇసుక పాలసీపై అధికారులను ఆరా తీశారు. ఈ క్రమంలోనే పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

వైసీపీ పాలనలో ఇసుక విధానం వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. గృహ నిర్మాణ రంగం కుదేలైందని చెప్పారు. ఇసుక రీచ్‌లు, డంప్‌లు వైసీపీ నేతలు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందని సమాచారం ఉందన్నారు. ధరలను విపరీతంగా పెంచి గతంలో ప్రజలను ఇబ్బందికి గురి చేశారని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇసుక ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారని తెలుస్తోంది. రీచ్‌లు, స్టాక్‌పాయింట్లు, డంప్‌ల పరిధిలో అందుబాటు ఉన్న ఇసుకపై అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దాదాపు 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని సీఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు.

ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాలంటే తీసుకోవాల్సిన చర్యలపై గనుశాఖ డైరెక్టర్‌తో సీఎం చంద్రబాబు చర్చించారు. ఉచిత ఇసుకపాలసీతో పాటు గతంలో జరిగిన తప్పిదాలు, ఇతర అంశాలపై మరోసారి సమీక్ష నిర్వహించుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమావేశానికి సమగ్ర నివేదికలు తీసుకురావాలని ఆదేశించారు. మరోవైపు ఆఫ్‌లైన్‌లో ఇసుక అమ్కాలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌‌లో బుక్ చేసుకునే విధానం తీసుకురావాలని చంద్రబాబు తేల్చిచెప్పినట్టు సమాచారం.

Next Story