పెంచిన పెన్షన్లతో నెలకు రూ.819 కోట్ల భారం: సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టారు.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2024 5:00 AM GMT
andhra pradesh, cm chandrababu, letter,  pension money,

పెంచిన పెన్షన్లతో నెలకు రూ.819 కోట్ల భారం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెట్టారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తొలిరోజే పెన్షన్ దారులకు పెన్షన్‌ పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే తాజాగా సీఎం చంద్రబాబు పెన్షన్ దారులకు బహిరంగ లేఖ రావారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు అన్నారు. మీకు అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలను పెంచి ఇస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6వేలు ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు.

పెంచిన పెన్షన్ డబ్బులను జూలై 1 నుంచే లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై ఆర్థిభారం పెరుగుతుందన్నారు. నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం పెన్షన్ దారులను మోసం చేసిందన్నారు. ఎంతో క్షోభ పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల వేళ 3 నెలల పాటు పెన్షన్ దారులు పడ్డ కష్టాలను చూశానని సీఎం చంద్రబాబు అన్నారు. మంటుడెండలో.. వడగాల్పుల మధ్య పడిన అగచాట్లను చూసి చలించిపోయినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే జూలై నుంచి ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ నెల నుంచే పెంచిన పెన్షన్ వర్తింప చేస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి ఆ డబ్బులను జూలైలోనే అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Next Story