Andhra Pradesh: వారికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం సాయం
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 1:02 AM GMTAndhra Pradesh: వారికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం సాయం
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల చేనేత కార్మికులతో సమావేశం అయిన సీఎం చంద్రబాబు వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. చేనేత కార్మికులతో మాట్లాడారు.
చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు తాము చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. వెనుకబడ్డ వర్గాలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేస్తామన్నారు. ఇది పార్లమెంట్‌లో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికలకు జీఎస్టీ తొలగించకుంటే రీయంబర్స్ చేస్తామన్నారు. నేతలకు రూ.67 కోట్లు ఇచ్చి వారికి న్యాయం చేస్తామన్నారు చేనేత మగ్గాల కోసం రూ.50 వేలు సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నేతన్నలను కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పారు. అలాగే మరమగ్గాల కార్మికులకు, సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. చేనేతకారులకు ఆరోగ్యబీమా కల్పిస్తామని.. నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామన్నారు. అంతేకాదు చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.