దీపావళి నుంచే ఉచిత గ్యాస్ పథకం: సీఎం చంద్రబాబు
టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2024 7:45 PM ISTమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కీలక కామెంట్స్ చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని అన్నారు. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధానం ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అయితే.. టీడీపీకి కార్యకర్తలే బలం అన్నారు. వారి త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. వంద రోజుల్లోనే ప్రజల మన్ననలను పొందిన ప్రభుత్వంగా నిలిచామని చెప్పారు. అలాగే.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించి ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని... దోషులను వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారనీ.. ఇందులో దోషులుగా తేలిన వారిని తేలిగ్గా వదలబోము అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమనీ.. ఆర్భాటాలు ఏమీ ఉండవని సీఎం చంద్రబాబు అన్నారు.