ప్రజల జీవన ప్రమాణాల పెంపులో తొలి అడుగుపడింది: సీఎం చంద్రబాబు
ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 1 July 2024 3:30 AM GMTప్రజల జీవన ప్రమాణాల పెంపులో తొలి అడుగుపడింది: సీఎం చంద్రబాబు
ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పలువురు పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులను అందించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం అని చెప్పారు. వారి జీవన ప్రమాణాల పెంపులో తొలి అడుగు పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పెనుమాకలో పెన్షన్ల పంపిణీ తర్వాత ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు, పెన్షన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదంతో నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశానన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు చంద్రబాబు. పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని చెప్పారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే నా ఆలోచన అన్నారు. దివ్యాంగులకు పింఛను రూ.6వేలు చేశామనిసీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏపీలో ఇవాళ 1.25 లక్షల మంది సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ జరుగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికి వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు ఐదు సంతాకలు పెట్టానని అన్నారు. మెగా డీఎస్సీ కూడా ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా టీచర్ల నియామకం చేపట్టే బాధ్యతను కూడా తాను తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వానికి శక్తి వస్తే ప్రజలకు మరింత తిరిగి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వ పాలన అన్నీ తప్పులు, అప్పులే చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గతంలో ప్రజల బతుకులు రివర్స్ చేశారని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం తాము పనిచేస్తామని.. ప్రజల జీవితాలను ముందుకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం.. పెంచిన దాన్ని పంచుతామని సీఎం చంద్రబాబు చెప్పారు.