రేష‌న్ బియ్యం వ‌ద్ద‌నుకుంటే న‌గ‌దు తీసుకోవ‌చ్చు..!

Andhra Pradesh Civil Supplies department decided to give cash to Ration rice.మీరు రేష‌న్ కార్డుదారులా..? ఈ నెల మీకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2022 11:04 AM IST
రేష‌న్ బియ్యం వ‌ద్ద‌నుకుంటే న‌గ‌దు తీసుకోవ‌చ్చు..!

మీరు రేష‌న్ కార్డుదారులా..? ఈ నెల మీకు బియ్యం అవ‌స‌రం లేదా..? అయితే.. ఎంచ‌క్కా మీరు బియ్యానికి బ‌దులు న‌గ‌దు తీసుకోవ‌చ్చు. అయితే.. ఇది అంద‌రికీ కాదండి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వారికి మాత్ర‌మే. ఏపీలో రేష‌న్ ఇచ్చే విధానంలో స్వ‌ల్ప మార్పులు చేయాల‌ని ప్ర‌భుత్వం బావిస్తోంది. రేషన్‌కార్డుదారులకు నగదు బదిలీని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ల‌బ్దిదారులు రేష‌న్ బియ్యం వ‌ద్ద‌నుకుంటే వారికి ఆ మేర‌కు న‌గ‌దు ఇవ్వ‌నుంది. మే నెల నుంచి దీనిని అమ‌లు చేసే దిశ‌గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

ముందుగా కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌నున్నారు. జీవీఎంసీ ప‌రిధిలోని అన‌కాప‌ల్లి, గాజువాక ప్రాంతాల‌తో పాటు న‌ర్సాపురం, నంద్యాల, కాకినాడల‌ను ఇందుకు ఎంపిక చేశారు. ఇక్క‌డ విజ‌య‌వంతం అయితే.. ద‌శ‌ల వారీగా దీన్ని మిగ‌తా జిల్లాల‌కు విస్త‌రిస్తారు. నగదు బదిలీకి సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని వలంటీర్ల ద్వారా ఈ నెల 18 నుంచి 22 వరకు అంగీకార పత్రాలు తీసుకుంటారు. 23న వీఆర్వో పరిశీలన, 25న తహసీల్దార్ ఆమోదం తీసుకుంటారు.

కాగా.. కిలో బియ్యానికి ఎంత చెల్లించ‌నున్నారు అన్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అయితే.. రూ.12 నుంచి రూ.15 మ‌ధ్య ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. బియ్యానికి బ‌దులుగా న‌గ‌దు ఇవ్వ‌డంపై ముందుగా కార్డుదారుల అభిప్రాయం తీసుకోనున్నారు. వారు అంగీక‌రిస్తే.. న‌గ‌దు ఇస్తారు. రెండు నెల‌ల న‌గ‌దు తీసుకుని త‌రువాత నెల‌లో బియ్యం కావాల‌న్నా తీసుకోవ‌చ్చు. తొలుత వ‌లంటీర్ల ద్వారా న‌గ‌దు అందించాల‌ని అధికారులు బావిస్తున్నారు. ఆ త‌రువాత నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేసే యోచ‌న‌లో అధికారులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story