ప్రేమ జంటకు సాయం.. ఇంటిపై దాడి చేసిన అమ్మాయి బంధువులు
ప్రేమ జంటకు సాయం చేసిన ఒక కుటుంబం చిక్కుల్లో పడింది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 11:00 AM ISTప్రేమ జంటకు సాయం.. ఇంటిపై దాడి చేసిన అమ్మాయి బంధువులు
ప్రేమ జంటకు సాయం చేసిన ఒక కుటుంబం చిక్కుల్లో పడింది. యువతి కుటంబ తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు ఏకంగా ఒక ఇంటిపై దాడికి చేశారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటకు చెందిన ప్రేమికులు పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. యువకుడి బంధువైన మైన్నగూడేనికి చెందిన రాజు వారికి ఆశ్రయం కల్పించాడు. దాంతో.. ఆశ్రయం కల్పించిన రాజుపై అమ్మాయి తరఫు బంధువులు కోపం పెంచుకున్నారు. శనివారం అతని ఇంటిపైకి దాడి చేసేందుకు వెళ్లారు. ఇంట్లో ఉన్న సామగ్రిని బయటకు విసిరేసి ధ్వంసం చేశారు. ఇక అక్కడి నుంచి తప్పించుకునేందుకు రాజు ప్రయత్నించాడు. అంతే అతన్ని పట్టుకుని.. పెట్రోల్ పోశారు. సజీవ దహనం చేయాలని చూశారు.
స్థానికులు కలుగజేసుకుని రాజును కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్రతోపాటు మరో 50 మందికిపైగా తనపై దాడిచేసినట్టు బాధితుడు రాజు ఆరోపించాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తన తల్లి కనకదుర్గ, మేనత్త శశిరేఖపైనా నిందితులు దాడిచేసినట్టు రాజు పేర్కొన్నాడు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, దాడి విషయం తెలిసి ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.