స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు..ఇప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 8:00 AM GMTస్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు..ఇప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎంపిక అయ్యిన తర్వాత సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు కూడా ఒకరని చెప్పారు. ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఏడుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నిక అయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. అయ్యన్న ఏపదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారని చెప్పారు.
66ఏళ్ల వయసు వచ్చినా అయ్యన్నపాత్రుడు ఇప్పటికీ ఫైర్ బ్రాండే అని చెప్పారు చంద్రబాబు. గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఆయనపై ఎన్నో స్టేషన్లలో కేసులు పెట్టి వేధించారని అన్నారు. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అయ్యన్నపాత్రుడు ఎంతో కృషి చేశారన్నారు. గత ప్రభుత్వం పవిత్రమైన అసెంబ్లీని దెబ్బతీసిందని చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. మైకు ఇవ్వకుండా అవమానపరిచారన్నారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే చెప్పానని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. అన్నీ గమనించిన ప్రజలు కౌరవసభకు వ్యతిరేకించారనీ.. గౌరవ సభకు తనని పంపారని అన్నారు. భవిష్యత్‌లో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూస్తానని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. కూటమికి 164 సీట్లు వచ్చాయనీ.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని వైసీపీ నాయకులు ఎగిరిపడ్డారని అన్నారు. ఇవాళ 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటా జనసేన ఘన విజయం సాధించిందని చెప్పారు. దీనంతటి వెనుక ఉన్నది పవనే అని చెప్పారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో పవన్ కు బాగా తెలుసని చెప్పారు. వైసీపీ వైనాట్ 175 అని చెప్పుకుందనీ.. కానీ 11 స్థానాలకే పరిమితం అయ్యిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషం:పవన్
స్పీకర్ అయ్యన్నపాత్రుడు సుదీర్ఘ అనుభవం ఉందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన స్పీకర్‌గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ్టి ఉంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని చెప్పారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని చెప్పారు పవన్ కల్యాణ్. ఎంతటి కఠినమైన సమస్యలు అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.