అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. స్పౌజ్ కోటా ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియను ప్రభుత్వం ఈ నెల 30లోగా పూర్తి చేయనుంది. అర్హులైన వారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో పరిశీలించి, సీనియారిటీ ప్రకారం జాబితాలు ప్రకటిస్తారు. 29వ తేదీకల్లా బదిలీల ఆర్డర్ జారీ చేయడంతో పాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేయనున్నారు.
అర్హులు ఎవరంటే?
భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ వాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పని చేస్తూ ఉండాలి.
ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే బదిలీ వర్తించదు.
మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
ప్రభుత్వానికి బకాయిలు లేనట్టు ధ్రువీకరణపత్రం ఉండాలి.
మెరిట్ ర్యాంకు ఆధారంగా బదిలీ చేస్తారు. ఒక వేళ టై అయితే సీనియారిటీ, పుట్టిన రోజు ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు.
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. బదిలీలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. డిసిప్లనరీ, ఏసీబీ కేసులు ఉన్నవారు ట్రాన్స్‌ఫర్‌కు అనర్హులని తెలిపింది. ప్రొవిజినల్ సీనియారిటీ, క్లియర్ వెకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారు. పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. శాఖ సెక్రటరీలు ఇంటర్ బదిలీ ఆర్డర్లు ఇస్తారు.