Andhrapradesh: 'మీకు జీతం ఎవరు ఇస్తున్నారు'.. ఎస్‌ఐపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి సతీమణి తన వెంట స్థానిక ఎస్‌ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

By అంజి  Published on  2 July 2024 11:28 AM IST
Andhrapradesh, minister wife, minister Mandipalli Ramprasad Reddy

Andhrapradesh: 'మీకు జీతం ఎవరు ఇస్తున్నారు'.. ఎస్‌ఐపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన 

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఒక కార్యక్రమానికి వెళుతున్న సమయంలో తనను వేచి ఉండేలా చేసినందుకు పోలీసు అధికారిని మందలించిన వీడియో వైరల్ కావడంతో వివాదం రేపింది. పబ్లిక్‌లో పోలీసులపై జులుం ప్రదర్శించారు. మంత్రి భార్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి స్థానిక కార్యక్రమానికి వెళ్తుండగా అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులోని ప్యాసింజర్ సీట్లో కూర్చున్న ఆమె 30 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని రమేష్ అనే సబ్-ఇన్‌స్పెక్టర్‌ను మందలించినట్లు వీడియోలో ఉంది. ఆమె పోలీసు అధికారిపై అనేక ప్రశ్నలు విసిరి, అతని ప్రవర్తనపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

"ఇంకా ఉదయం కాలేదా? మీకు ఏ కాన్ఫరెన్స్ ఉంది? మీరు పెళ్లికి వచ్చారా? లేక డ్యూటీకి వచ్చారా? మీ కోసం అరగంట వేచి ఉన్నాను. మీకు జీతం ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ లేదా వైఎస్ఆర్సీపీనా?" అంటూ పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఆమె మాట వింటూ అక్కడే నిలబడిన పోలీసు అధికారిని ఆమె తిట్టింది. వీడియో చివర్లో.. సబ్-ఇన్‌స్పెక్టర్ హరితారెడ్డికి సెల్యూట్ చేసి, కాన్వాయ్‌ని నడిపించమని ఆమె సూచించడంతో ముందుకు కదిలారు.

''మంత్రి భార్యకు రాజ మర్యాదలు కావాలట.. రాయచోటిలో ఎస్కార్ట్ గా రావాలని పోలీసులను కోరిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రూబాబు.. పోలీసులను బానిసలుగా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి భార్య.. నివ్వెరపోయిన పోలీసులు... నిస్సహాయ స్థితిలో ఆమెకు సలాం" అని మైక్రోబ్లాగింగ్ సైట్‌ ఎక్స్‌ వేదికగా వైసీపీ పోస్టు చేసింది.

Next Story