మ‌రోసారి స‌స్పెన్ష‌న్‌.. అందుకే తనపై కక్ష అంటున్న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

Andhra IPS officer AB Venkateswara Rao suspended again.సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును రాష్ట్ర‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2022 7:15 AM GMT
మ‌రోసారి స‌స్పెన్ష‌న్‌.. అందుకే తనపై కక్ష అంటున్న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును రాష్ట్ర‌ ప్ర‌భుత్వం మ‌రోసారి స‌స్పెండ్ చేసింది. నిఘా విభాగం చీఫ్‌గా పనిచేసిన స‌మ‌యంలో భ‌ద్ర‌తా ప‌రిక‌రాల కొనుగోళ్ల‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఆ కేసులో విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న సాక్షుల‌ను ఆయ‌న ప్ర‌భావితం చేసేందుకు య‌త్నించార‌న్న అభియోగంపై సస్పెండ్ చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దీనిపై బుధ‌వారం ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉండగా మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించగా.. విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకున్నారని అయితే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న తాను ఆ ఘటనలు జరగకుండా అడ్డుకున్నానని అందువల్లే తనను టార్గెట్ చేశారని అన్నారు.

ఏసీబీ ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రతిపదం, వ్యాఖ్యం అబద్ధమని కొట్టిపారేశారు. అబద్దాలు తప్పని నిరూపించుకోవడానికి తన వద్ద అన్ని ఆధారాలున్నాయన్నారు. తనపై తీసుకున్న చర్యలపై న్యాయ సమీక్షకు తిరిగి వెళ్తానని, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలు న్యాయ సమీక్షలో నిలబడే నిర్ణయాలు కావన్నారు. తనపై ఇంతవరకు ఏ చార్జిషీట్‌ లేదని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్‌, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిపై ఉన్న కేసుల విషయాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. శ్రీలక్ష్మిపై ఛార్జిషీట్‌ ఉన్నా ఆమెకు నిబంధనలు వర్తించవా అంటూ ప్రశ్నించారు.

ఈ విషయంలో తాను ఎవరినైనా వదిలిపెట్టనని తెలిపారు. తనను ప్రభుత్వం టార్గెట్‌ చేయడం లేదని కొంత మంది వ్యక్తులు, శక్తులు టార్గెట్‌ చేస్తున్నాయని మండిపడ్డారు. గడిచిన మూడేళ్లలో తనపై ఎన్నో పిటిషన్లు వేశారని ఇప్పటి వరకు ఏ ఒక్కటి నిరూపించలేక పోయారన్నారు.

Next Story
Share it