ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఓ ఇంటర్ బాలిక ఆడ బిడ్డను ప్రసవించింది. సహచరుల భయంతో నాలుగో అంతస్తు నుంచి ముళ్ల పొదల్లోకి శిశువును విసిరేయడంతో చనిపోయింది. ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాలికను ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంలో నిర్వాహకుల ప్రమేయం ఉందా? అని ఆరా తీస్తున్నారు. మరోవైపు హాస్టల్‌లో ఇంటర్ బాలిక ప్రసవం, బిడ్డను విసిరేయడంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మండిపడింది. ఈ ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ఆధారాంగా బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తామని తెలిపింది.
అటు హాస్టల్‌ను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించారు. డీఎస్పీ శ్రావణ్ కుమార్.. వసతి గృహం సిబ్బందితో మాట్లాడారు. బాలిక ఉండే గదిని.. ఆమె స్నేహితులను పోలీసులు విచారించారు. గర్భం దాల్చిన బాలిక నంద్యాల నుంచి వచ్చి శిక్షణ పొందుతోంది. పట్టణంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. రోజు హాస్టల్ నుంచి కాలేజీకి వెళ్లి వచ్చేది. నగర సమీపంలోని ఓ మిషనరీ కేంద్రంలో బ్రదర్‌లుగా శిక్షణ పొందుతున్న కొంతమంది తరచూ హాస్టల్‌కు వచ్చి వెళ్తుంటారని సమాచారం. ఈ క్రమంలోనే వారిలో ఒకరితో పెంచుకున్న పరిచయం వల్లే బాలిక గర్భం దాల్చినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ పిల్లలపై సిబ్బంది, పేరెంట్స్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోంది.