ఆ వీడియో మార్ఫింగా? కాదా? అనేది చెప్పలేకపోతున్నాం: ఎస్పీ

Anantapur SP Press conference on MP Gorantla Madhav video issue. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దుమారం రేపిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై అనంతపురం జిల్లా పోలీసులు కీలక విషయాలు

By అంజి  Published on  10 Aug 2022 1:18 PM GMT
ఆ వీడియో మార్ఫింగా? కాదా? అనేది చెప్పలేకపోతున్నాం: ఎస్పీ

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దుమారం రేపిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై అనంతపురం జిల్లా పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసు ప్రాథమిక విచారణకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఫకీరప్ప మీడియాకు తెలిపారు. వివాదాస్పద వీడియో కాల్‌ విషయంపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఫ్యాన్‌ కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్‌ పీఎస్‌లో ఈ నెల 4న కేసు నమోదు చేశామని తెలిపారు. ఆ తర్వాత చేపట్టిన దర్యాప్తులో.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో 3వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో యూకేలో రిజిస్టర్‌ అయిన వొడాఫోన్‌ నెంబర్‌తో మొదటగా ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేసినట్లు గుర్తించామని తెలిపారు.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన మొబైల్‌ నెంబర్‌ ఇంటర్నేషనల్‌ నెంబర్‌ అని, అందుకే దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎస్సీ వివరించారు. ఆ వొడాఫోన్‌ సిమ్‌ కార్డు కలిగిన వ్యక్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజెంట్‌ నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు. ''ఒకరు ఫోన్‌లో వీడియో చూస్తున్నప్పుడు.. దాన్ని మరొకరు వీడియో తీసి, ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో నెటిజన్లు చాలా మంది ఈ వీడియోను ఫార్వర్డ్‌ చేశారు. ఇక ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఫస్ట్‌సారి పోస్టు చేసింది కూడా ఫార్వర్డ్‌ వీడియోనే'' అని ఎస్పీ వివరించారు.

అది ఒరిజినల్‌ వీడియో కాదన్న ఎస్పీ.. అది మార్ఫింగ్‌ చేశారా? లేదా? అనేది తేల్చలేకపోతున్నామన్నారు. ఒరిజినల్‌ వీడియో దొరికే వరకు.. దాన్ని మొదట పోస్టు చేసిన వ్యక్తి దొరికే వరకు.. ఈ విషయాన్ని నిర్ధారించలేమని చెప్పారు. ఒరిజినల్‌ వీడియో దొరికితేనే.. అది మార్ఫింగా? కాదా? అనేది చెప్పగలుగుతామన్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవా? కాదా? అన్నది కూడా చెప్పలేం తెలిపారు. ఈ వీడియోను యూకేలో ఎడిటింగ్‌ చేసినట్టు తెలుస్తోందన్న ఎస్పీ.. ఒరిజినల్‌ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌ నివేదిక వస్తుందని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.

పరువు నష్టం దావా వేస్తా: గోరంట్ల మాధవ్

ఈ వీడియోకు సంబంధించిన వివరాలను అనంతపురం పోలీసులు వెల్లడించిన తర్వాత వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ స్పందించారు. అది 100 పర్సెంట్‌ ఫేక్‌ వీడియో అని గతంలోనే చెప్పానన్నారు. తాను కడిగిన ముత్యం అని, తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వీడియో సృష్టించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని.. పరువునష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు.

Next Story
Share it