నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషద పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని, కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఔషద తయారీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. వనమూలికలు, ముడిపదార్థాల సేకరణలో ఆనందయ్య బృందం నిమగ్నమైంది. రేపటి నుంచి మందు తయారీ జరుగనున్నది.
మందు పంపిణీపై ప్రకటన చేసే వరకు ఎవరూ గ్రామాల్లోకి రావొద్దని ఆనందయ్య స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత సర్వేపల్లి నియోజకవర్గానికేనని.. పంపిణీ సమయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కృష్ణపట్నం పరిధిలో ఇప్పటికే 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మందు పంపిణిపై ఈ రోజు కలెక్టర్‌తో ఆనందయ్య సమావేశం అయ్యారు. మందు పంపిణీపై చర్చించారు. కృష్ణపట్నం ఎవరూ రావొద్దని, ఆన్‌లైన్ లో మందు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ లో మందు పంపిణీకి మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పంపిణీకి మరో 5 రోజుల సమయం పడుతుందని అందరికీ తప్పకుండా మందు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ చక్రధర్‌బాబు తెలిపారు.