నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు అక్కడ ఉచితంగా మందుపంపిణీ చేస్తున్నారనే ప్రచారం రాష్ట్రం మొత్తం వ్యాపించింది. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేయగా.. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు.
ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టతరంగా మారుతోంది ప్రస్తుతం అక్కడ 5 వేల మందికి మందు తయారు చేసినప్పటికీ.. అక్కడ ఉన్న జనం 35 వేల మందికి పైగానే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అంబులెన్స్ లు 2 వేలు వరుసగా ఉన్నాయని తెలుస్తోంది. ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి చివరకు మీడియా వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని పోయాయి. కృష్ణపట్నం లోకి వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం లో కి బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రణలో తీసుకుంటున్నారు.