16 ఏళ్ల బాలికను పెళ్లాడిన వృద్ధ తాంత్రికుడు
An old magician married a 16-year-old girl.. An incident in Anantapur
By అంజి Published on 28 Aug 2022 7:43 AM ISTఅనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో అమానుష ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికను ఓ తాంత్రికుడు పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి బాలికను వివాహం చేసుకున్నాడు. 3 నెలల క్రితం రహస్యంగా జరిగిన పెళ్లి.. ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణ ఘటనపై బాలిక సమీప బంధువు శనివారం ఐసీడీఎస్ పీడీ బి.ఎన్.శ్రీదేవి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కూడేరు ఐసీడీఎస్ సీడీపీవో ధనలక్ష్మి, రాప్తాడు ఎస్సై రాఘవరెడ్డి, తదితరులను అప్రమత్తం చేసింది. వారు గ్రామానికి వెళ్లి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు.
కొన్ని రోజుల కిందట బాలిక తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఎన్ని ఆస్పత్రల్లో చికిత్స పొందినా అనారోగ్యం తగ్గలేదు. కూలీ పనికి వెళ్లి జీవనం సాగించే వారు. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తాంత్రికుడు జయకృష్ణ అలియాస్ జడలస్వామి (62)ని కలిశారు. బాలిక తల్లికి దెయ్యం పట్టిందని జడలస్వామి చెప్పి, క్షుద్ర పూజలు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలిక తల్లికి అనారోగ్యం తగ్గింది. ఇదంతా తన వల్లే జరిగిందని బాలిక తల్లిదండ్రులను నమ్మించాడు.
ఈక్రమంలో ఇంటర్ ఫస్టియర్ కంప్లీట్ చేసిన బాధితుల కుమార్తెపై తాంత్రికుడు కన్నేశాడు. వారికి మాయమాటలు చెప్పి బాలికతో వివాహానికి ఒప్పించాడు. 3 నెలల కిందట పెళ్లాడాగా.. స్థానికులకు శిష్యురాలిగా పరిచయం చేశాడు. శనివారం అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుసుకున్న జయకృష్ణ పరారయ్యాడు. బాలికను రక్షించి అధికారులు.. అనంతపురంలోని ఉజ్జ్వలహోంకు తరలించారు. జడలస్వామికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశాడు. క్షుద్రపూజల పేరిట అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని జడలస్వామిపై ఆరోపణలు ఉన్నాయి.