తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం

తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం దుబచర్ల గ్రామంలోని గాంధీ కాలనీలో శనివారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియని దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించారు.

By అంజి
Published on : 23 March 2025 7:54 AM IST

Ambedkar statue insulted, East Godavari, APnews

తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం

తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం దుబచర్ల గ్రామంలోని గాంధీ కాలనీలో శనివారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియని దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించారు. ఈ చర్యపై మాల మహానాడు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసి విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దోషులను అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించేవారిపట్ల అత్యంత కఠిన వ్యవహరించాలన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్‌ కాకుండా చూడాలని అన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అటు గోపాలపురం ఎమ్మెల్యే ఎంఎం వెంకట రాజు ఈ చర్యను ఖండిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. నల్లజర్ల సిఐ విజయ శంకర్ నేతృత్వంలోని పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. ఇంతలో, మాల మహానాడు కార్యకర్తలు దండను తొలగించి విగ్రహానికి పాలతో అభిషేకాలు చేశారు.

Next Story