రఘురామ లాజిక్ మిస్ అయ్యాడంటున్న అంబటి.. ఆయన వెనుక ఉన్నదెవరో తెలుసు

Ambati Rambabu Comments About Raghurama krishna Raju. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దీనిపై కీలక కామెంట్లు చేశారు.

By Medi Samrat  Published on  16 May 2021 10:39 AM GMT
Ambati Rambabu

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణం రాజు అరెస్టు గురించి పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఆయన తనను కొట్టారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. న్యాయస్థానంలో హాజరైన సమయంలో రఘురామకృష్ణంరాజు తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కాలికి తగిలిన దెబ్బలు చూపించారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దీనిపై కీలక కామెంట్లు చేశారు. రఘురామ కృష్ణంరాజు నాటకాలు ఆడుతూ ఉన్నారని విమర్శలు గుప్పించారు.ఎవరినైనా క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయాలని.. అది ఒక ప్రొసీజర్ అని అన్నారు. న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు వేస్తారని.. వాటిలో పోలీసులు మీపై చేయి చేసుకున్నారా.. లేకపోతే తప్పుగా ఏమైనా ప్రవర్తించారా అని ప్రశ్నిస్తారని తెలిపారు.

ప్రస్తుత కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక ముద్దాయని.. ఏపీ సిఐడి ఆయనపై కేసు రిజిస్టర్ చేయడం మాత్రమే కాక న్యాయస్థానంలో ప్రవేశపెట్టింది. సహజంగానే అక్కడున్న న్యాయమూర్తి ఈ కేసులో కూడా ప్రశ్నలు అడుగుతారు. ఈ విషయం పోలీసులకి కూడా తెలుసని అన్నారు. ఏపీ సిఐడి కి కేసుకు సంబంధించి చాలా విషయాలు తెలిసిన తర్వాత కూడా కోర్టులో ప్రవేశపెట్టక ముందు ఆయనపై చేయి ఎందుకు చేసుకుంటారని అంబటి రాంబాబు లాజిక్ ను బయటకు తీశారు.

కొట్టాల్సిన అవసరం పోలీసులకు లేదని.. ఇలాంటి తరుణంలో రఘురామకృష్ణంరాజు పోలీసులు కొట్టారంటూ వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తుగడ అని అంబటి రాంబాబు ఆరోపించారు. జనరల్ గా న్యాయస్థానం రిమాండ్ విధించిన తర్వాత జైలుకు పంపిస్తారని.. జైలుకు వెళ్లకుండా హాస్పిటల్ లోకి వెళ్ళటం కోసం థర్డ్ డిగ్రీ అనే కొత్త ఎపిసోడ్ రఘురామకృష్ణం రాజు తెరపైకి తెచ్చినట్లు తాను భావిస్తున్నానన్నారు అంబటి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని రావాలన్నది రఘురామకృష్ణంరాజు ప్లాన్ అని అంబటి విమర్శించారు. రఘురామకృష్ణం రాజు చేసిన పనులకు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని.. రఘురామకృష్ణం రాజు విషయంలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళడానికి చాలా సమయమే పట్టిందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. రఘురామకృష్ణం రాజు వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడని కూడా ఆరోపించారు అంబటి రాంబాబు.


Next Story
Share it