టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ విషయంలో కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఇప్పటికే టీడీపీ నేత నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు విషయం తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ A14 గా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. తాజాగా ఇదే కేసులో ఏ2 గా ఉన్న నారాయణకు కూడా నోటీసులు పంపింది సీఐడీ. 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వాట్సాప్ ద్వారా నారాయణకు సీఐడీ నోటీసులు పంపించారు. 4వ తేదీన ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నారా లోకేష్‌తో పాటు తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నారాయణ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భారీగా అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ పేరిట భారీ అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును సీఐడీ ఈ కేసులో చేర్చింది.