ఏపీలో మ‌రోమారు కేటీఆర్ పేరు.. మాకు కావాలి అంటున్నారు

Amaravati Farmers Want to Ask KTR Support Capital Movement. విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్‌ మద్దతు తెలపడం, ఇదే చొరవను అమరావతి ఉద్యమం విషయంలోనూ ఆయన చూపించాలని రైతులు కోరారు.

By Medi Samrat  Published on  12 March 2021 11:37 AM IST
Amaravati Farmers Want to Ask KTR Support Capital Movement

విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మద్దతు తెలపడం, అవసరమైతే విశాఖపట్నం వెళ్లి అండగా నిలుస్తామన్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని రాజధాని రైతులు అన్నారు. ఇదే చొరవను అమరావతి ఉద్యమం విషయంలోనూ ఆయన చూపించాలని కోరారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా హాజరయ్యారని, ప్రపంచ ప్రఖ్యాత నగరంగా విరాజిల్లాలని ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు.

450 రోజులుగా రాజధాని కోసం భూములిచ్చిన తాము న్యాయం కోసం ఉద్యమం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతిలో రైతులు, రైతు కూలీలు చేస్తున్న నిరసనలు గురువారమూ కొనసాగాయి. శివరాత్రి కావడంతో దీక్షా శిబిరాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి.

గురువారం తుళ్లూరులో సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 'అమరావతి జన జాగృతి జాగరణ' కార్యక్రమాన్ని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి ప్రారంభించారు. పూర్తిస్థాయి రాజధానిగా అమరావతి కొనసాగి అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐకాస కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల వినోద బృందం, అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక రమణ బృందాల సభ్యులు ఉద్యమ గీతాలను ఆలపించారు.


Next Story