ఈ ఏడాది మేలో ఎన్నికల సమయంలో నంద్యాలలో తమపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రవిచంద్రకు మద్దతు తెలిపే ర్యాలీలో అర్జున్ వచ్చారని అధికారులు కేసు నమోదు చేశారు. అల్లర్లు జరిగే ప్రమాదానికి కారణమైనందుకు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సరైన అనుమతి లేకుండా ఎన్నికల కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడం ద్వారా ఎన్నికల కోడ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు చట్టంలోని సెక్షన్లను ఉల్లంఘించారని పోలీసులు అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రవిచంద్రకు మద్దతు తెలిపేందుకు 2024 మే 11న తన భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు. అర్జున్ రాకతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మే 11, 2024న నంద్యాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ చెల్లదని అల్లు అర్జున్, రవిచంద్ర ఇద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా రక్షణ కోరాడు అల్లు అర్జున్. ప్రధాన పిటిషన్‌తో పాటు, ఏదైనా అరెస్టులతో సహా తదుపరి అన్ని చర్యలపై స్టే విధించాలని కోర్టును అభ్యర్థిస్తూ ఇంటర్‌లోక్యూటరీ దరఖాస్తును సమర్పించాడు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపు దీనిపై విచారణ చేపట్టనుంది.