పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి : మంత్రి కొల్లు రవీంద్ర

నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  14 Oct 2024 3:32 PM GMT
పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి : మంత్రి కొల్లు రవీంద్ర

నూతన ఎక్సైజ్ పాలసీ 2024ని అత్యంత పారదర్శకంగా అమలు చేసిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కానూరులోని ఏపీఎండీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా పూర్తి పారదర్శకంగా పాలసీని అమలు చేసి చూపించాం అన్నారు. అత్యంత పకడ్బందీగా షాపుల కేటాయింపు జరిగిందన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో చేసిన దుర్మార్గాలకు, స్కాములకు నేటితో తెరదించాం అన్నారు. 3396 షాపులకు అక్టోబర్ 1 నుండి దరఖాస్తులు ఆహ్వానించగా 89,882 మంది దరఖాస్తు చేసుకున్నారన్ని.. ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించాం అన్ని తెలిపారు. దీంతో ప్రభుత్వానికి రూ.1797 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేకుండా షాపుల్ని కేటాయించాం అన్నారు.

పారదర్శకంగా షాపుల కేటాయింపు

గతంలో ఒక్కో షాపునకు సగటున 18 దరఖాస్తులు వస్తే.. ఇప్పుడు ఏకంగా 26.7 దరఖాస్తులు వచ్చాయి . ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కో షాపునకు వందకు పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. 2015-17లో 4380 షాపులకు 65,208 దరఖాస్తులు రాగా రూ.225 కోట్ల ఆదాయం వచ్చింది. 2017-19లో 4377 షాపులకు 76,329 దరఖాస్తులు రాగా రూ.422 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. కానీ ఇప్పుడు ఏకంగా 89,882 దరఖాస్తులు, రూ.1797 కోట్ల ఆదాయం రావడం సంతోషకరం. ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఈ దరఖాస్తులు నిదర్శనం. డ్రా నిర్వహణ కూడా ప్రశాంతంగా జరగడమే కాకుండా పారదర్శకంగా నిర్వహించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఇంత విజయవంతం చేసినందుకు కమిషనర్, సెక్రటరీ, ఎక్సైజ్ సిబ్బంది, సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

తప్పు చేస్తే ఏ ఒక్కరినీ క్షమించబోం

తప్పు చేస్తే ఏ ఒక్కరినీ వదిలేది లేదు. నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహించినా, మద్యం అమ్మకాలు జరిగినా కఠినమైన చర్యలుంటాయి. సిండికేట్ జరిగినట్లు ప్రస్తుతానికి ఎక్కడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటి ఘటనలు జరిగినట్లు వెలుగులోకి వస్తే చర్యలుంటాయి అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో మహిళలు, ఉద్యోగులు, యువత కూడా దరఖాస్తులు చేసుకున్నారు. గుడి, బడికి చుట్టు పక్కల ఎక్కడైనా 100 మీటర్లలోపు ఉండడానికి వీల్లేదన్నారు. ఆమేరకు కట్టుబడి ఉన్నాం. సెబ్ విలీనంతో ఎక్సైజ్ శాఖ కూడా బలోపేతమైంది. తద్వారా షాపులపై విజిలెన్స్ కూడా అంతే కఠినంగా ఉంటుందన్నారు. ఎంఆర్‌పీ ధరల ఉల్లంఘనలు, బెల్టు, కల్తీ మద్యం అమ్మకాలపై కఠినంగా చర్యలుంటాయని హెచ్చరించారు.

గతంలో తయారీ నుండి అమ్మకం వరకు ఒకరి చేతుల్లోనే

గత పాలకులు ఎవరికీ వ్యాపారం చేసుకునే వీలు లేకుండా ఏకపక్షంగా షాపులన్నింటినీ హస్తగతం చేసుకున్నారు. మద్యం తయారీ నుండి అమ్మకం వరకు అన్ని వ్యవస్థల్నీ గుప్పిట్లో పెట్టుకుని మద్యం మాఫియాను నడిపించారు. ప్రభుత్వ ఆధీనంలో షాపుల్ని పెట్టుకుని ప్రజల ప్రాణాలు తీశారన్నారు. దరలు పెంచి పేదల జేబులు గుల్ల చేశారు. అలాంటి అరాచకాలకు అవకాశం లేకుండా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు కూడా అభినందనీయం అన్నారు. నాణ్యమైన మద్యాన్ని అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.గత ఐదేళ్లు సగటున ఏటా రూ.25 వేల కోట్ల ఆదాయం ఉంది. ప్రస్తుతం 10శాతం పెరిగి ఏటా రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక లాంటి ప్రాతాలకు మద్యం అక్రమ రవాణా జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం అన్నారు. త్వరలోనే టెండర్ కమిటీ ఏర్పాటు చేసి కొత్త బ్రాండ్లకు అనుమతులు మంజూరు చేస్తాం అన్నారు. ఇప్పటికే నమోదైన బ్రాండ్లు షాపులు ప్రారంభం నుండే అందుబాటులో ఉంటాయి అన్ని.. గీత కార్మికులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వారికి కేటాయించిన షాపుల్ని భర్తీ చేస్తాం అన్నారు.

Next Story