అమరావతి: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసం అయ్యింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి (వైసీపీ)పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ ఉదయం విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జీవీఎంసీ ఇంఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్ హరేంద్రప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వెంకట కుమారి మేయర్ పదవి కోల్పోయారు. అవిశ్వాస తీర్మాన పరీక్ష నేపథ్యంలో జీవీఎంసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు భద్రత కల్పించారు.
రేపు కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. అటు ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా, 21వ డివిజన్ కార్పొరేటర్ వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యులు 16 మంది ఉండగా, 11 మంది కూటమి వైపే ఉన్నారు. వైసీపీకి నలుగురి బలం ఉంది. కార్పొరేటర్లు జనసేనకు 14 , బీజేపీకి ఇద్దరు, టీడీపీకి 48 మంది కలిసి మొత్తం 75 మంది వరకు సంఖ్యాబలం ఉండగా, సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు.