వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెల్‌ఫోన్ పోయినట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసుకుల ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఈ నెల 21 నుంచి ఫోన్ కనిపించడం లేదని పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో ఫోన్ పోయిందని విజయసాయి పర్సనల్ అసిస్టెంట్ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ఫోన్‌లో అత్యంత విలువైన సమాచారం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి ఫోన్ కన్పించకుండా పోవడంతో ఎవరో కావాలని దానిని దొంగిలించారని భావిస్తున్నారు. ఫోన్ ఎక్కడ పోయిందనేది స్పష్టంగా తెలియడం లేదు. విజయసాయిరెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనేక చోట్లకు తిరగడంతో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్‌పై టీడీపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇన్ఫర్మేషన్ బయటపడుతుందనే భయంతోనే ఫోన్ పోయిందని విజయసాయిరెడ్డి డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఫోన్ పోలేదని.. కావాలనే పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ''ఏ 2 ఫోన్ పోలేదు.. పడేసాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం తో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయి.'' అంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశాడు. విజయసాయిరెడ్డి ఫోన్ పోయిందా? లేక జగన్ లాక్కున్నారా? అంటూ మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ఈడీ విచారణలో బాగోతం బయటపడుతుందనే కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.