AndhraPradesh: 'స్టార్' నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లోని 'స్టార్' అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ నియోజకవర్గగాల్లో ముఖ్యంగా పార్టీ అగ్రనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
By అంజి Published on 18 May 2024 1:00 AM GMTAndhraPradesh: 'స్టార్' నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని 'స్టార్' అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ నియోజకవర్గగాల్లో ముఖ్యంగా పార్టీ అగ్రనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో ప్రధానంగా ముఖ్యమంత్రి, వైఎస్సార్సీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. అగ్రనేతల మార్జిన్లు, గెలుపు ఓటములపై విశ్లేషకులు, పంటర్లు అనేక ఊహాగానాలలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటింగ్ శాతం 81.34. 2,29,687 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,86,833 మంది ఓటు వేశారు.
జగన్ మోహన్ రెడ్డికి పులివెందులలో గతంలో, ప్రస్తుత నియోజక వర్గంతో ఉన్న అనుబంధం, ముఖ్యమంత్రిగా పని చేయడం వల్ల ఇది కేక్‌వాక్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో 90,110 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది ఈసారి లక్ష దాటుతుందని వైఎస్సార్సీపీ అంచనా వేయగా, మెజారిటీని తగ్గించుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మొత్తం 2,25,775 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం 89.88. 1,01,306 మంది పురుషులు, 1,01,608 మంది మహిళలు ఓటు వేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలతో కలిసి ముఖ్యమంత్రి గత మూడేళ్లుగా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ను నమోదు చేయడంతో వారి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి ఈసారి చంద్రబాబు నాయుడుపై యువ కేఆర్‌జే భరత్‌ని రంగంలోకి దించారు. ఎన్నడూ కుప్పంలో మకాం వేయని చంద్రబాబు మొన్నటి ఎన్నికల సమయంలో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించకపోయినా ఈసారి మాత్రం ఓటర్లకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చేందుకు సతీమణి భువనేశ్వరితో కలిసి కుప్పంలోనే మకాం వేశారు. తాను ఇక్కడే ఉంటానని నిరూపించుకునేందుకు అక్కడ ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో నాయుడు అరడజను సార్లు నియోజకవర్గానికి వచ్చారు.
మంగళగిరిలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో నారా లోకేశ్ కసరత్తు చేశారు. మంగళగిరి ప్రజలకు సుపరిచితుడైన ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్య అనే మహిళా అభ్యర్థిని వైఎస్‌ఆర్‌సి బరిలోకి దింపింది. నియోజకవర్గంలో 2,92,432 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,21,038 మంది పురుషులు, 1,29,697 మంది మహిళలు ఓటు వేయగా, ఈసారి 85.74 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యారు. వైఎస్‌ఆర్‌సి బీసీ ఓట్లపై కన్నేసింది. మంగళగిరిలో ఆధిపత్యంగా ఉన్న నేత సామాజికవర్గం మద్దతుతో లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఫలితాలు కూడా ఎంతో ఆసక్తిగా ఉండనున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఈసారి మరో విపత్తును నివారించడానికి ఆయన పిఠాపురంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను దించి ప్రచారం చేశారు. పిఠాపురంలో 2,36,409 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,03,370 మంది పురుషులు, 1,01,438 మంది మహిళలు ఓటు వేయగా 86.63 శాతం పోలింగ్ నమోదైంది. పవన్‌కు గట్టి పోటీనిచ్చిన వంగగీత అనే బలమైన మహిళా అభ్యర్థిని వైఎస్‌ఆర్‌సి రంగంలోకి దించింది.
అటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈసారి రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై పోటీకి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు కూడా పోటీలో ఉండడం విశేషం. రాజమహేంద్రవరం లోక్‌సభలో మొత్తం 16,23,149 మంది ఓటర్లు ఉండగా, వారిలో 6,47,491 మంది పురుషులు, 6,66,081 మంది మహిళలు ఓటేశారు, 80.93 శాతం పోలింగ్ నమోదైంది. ఆసక్తికరంగా, జూదగాళ్లు, పంటర్లు ఈ స్టార్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఫలితాలపై భారీ మొత్తాలను పెట్టుబడి పెడుతున్నారు.