రాష్ట్రంలో సైబర్‌క్రైమ్ మినహా నేరాలన్నీ అదుపులోనే: ఏపీ డీజీపీ తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా దాదాపు 7 నెలలు పని చేసిన ద్వారకా తిరుమలరావు రేపటితో పదవీ విరమణ చేయనున్నారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 6:42 PM IST
రాష్ట్రంలో సైబర్‌క్రైమ్ మినహా నేరాలన్నీ అదుపులోనే: ఏపీ డీజీపీ తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా దాదాపు 7 నెలలు పని చేసిన ద్వారకా తిరుమలరావు రేపటితో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 35 సంవత్సరాల ప్రస్థానం సంతృప్తికరంగా, గర్వంగా ఉందని అన్నారు. శాంతి భద్రతలు పర్యవేక్షించడం, నేరాలను వెలుగులోకి తీయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా నేరాలన్నీ అదుపులోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటి వరకూ 28,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫింగర్ ప్రింట్ ఆధారారంగా నేరాలు గుర్తించడంలో రాష్ట్రం ముందున్నట్లు తెలిపారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో స్పెషల్ ఫోకస్ పెట్టామని, నేరం చేసేందుకు నేరగాళ్లు భయపడేలా నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సైబర్ నేరాలను తగ్గించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని డీజీపీ తిరుమలరావు తెలిపారు. కసబ్‌ను ఇంటరాక్ట్ చేసే అవకాశం వచ్చిందని చెప్పిన ఆయన.. దానిని ప్రౌడ్ మూవ్‌మెంట్‌గా భావిస్తున్నట్లు చెప్పారు.
కాగా తిరుమలరావును కూటమి ప్రభుత్వం రిలీవ్ చేసింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు కమిషనర్, ఆర్టీసీ వీసీ, ఎండీ పదవుల నుంచి రిలీవ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత కామారెడ్డి, ధర్మవరం ఏఎస్పీగాను, నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగంగా అదనపు ఎస్పీగా కొనసాగారు. అనంతపురం, కడప, మెదక్ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ రేంజ్‌తో పాటు ఎస్ఐబీలో డీఐజీగా, చెన్నై సీబీఐలో కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఏపీ ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ద్వారకా తిరుమల రావు పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2021లో ఆర్టీసీ ఎండీగా నియామకమయ్యారు. 2024 జూన్ 21న ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
కాగా నూతన ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. పూర్తి అదనపు బాధ్యతలతో గుప్తాను డీజీపీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావ్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ పొందనున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల సమయంలోనూ డీజీపీగా వ్యవహరించారు. 2025 ఆగష్టులో పదవీ విరమణ పొందేవరకు హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా కొనసాగనున్నారు.